స్వస్తిక్ న్యూస్,మార్కాపురం :- దాదాపు 35 సంవత్సరాల చరిత్ర కలిగిన చాట్లమడ అగ్రహారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నేడు మనుగడ కోసం పోరాడుతోంది. తరతరాలుగా గ్రామీణ విద్యార్థులకు విద్యను అందించిన ఈ పాఠశాల ప్రస్తుతం ఉపాధ్యాయుల కొరత, విద్యార్థుల సంఖ్య తగ్గుదలతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు గ్రామ పిల్లల విద్యకు కేంద్రబిందువుగా నిలిచిన ఈ విద్యాలయం నేడు మూసివేత అంచున నిలవడం గ్రామస్థులను ఆందోళనకు గురిచేస్తోంది.గత ప్రభుత్వ హయాంలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. అయితే ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థుల సంఖ్య ఏటేటా తగ్గుతోంది. 2024లో 26 మంది విద్యార్థులు ఉండగా, 2025లో 18 మందికి, ప్రస్తుతం 14 మందికి చేరింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు.

పాఠశాలలో ఉండాల్సిన ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు దీర్ఘకాలిక సెలవులో ఉండగా, మరొకరు బదిలీపై వెళ్లిపోయారు. ప్రస్తుతం డిప్యుటేషన్‌పై వచ్చిన ఒకే ఒక్క ఉపాధ్యాయురాలు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు బోధిస్తున్నారు. ఒకే గదిలో ఐదు తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొనడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం కష్టంగా మారింది.గ్రామ భవిష్యత్తుకు పునాది అయిన ఈ 35 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రభుత్వ పాఠశాలను కాపాడేందుకు వెంటనే ఇద్దరు శాశ్వత ఉపాధ్యాయులను నియమించి, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని గ్రామస్థులు విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు. లేకపోతే చాట్లమడ అగ్రహారం పాఠశాల త్వరలోనే చరిత్రలో కలిసిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తోట గురునాధం అభిప్రాయం...

"35 ఏళ్ల చరిత్ర కలిగిన చాట్లమడ అగ్రహారం ప్రభుత్వ పాఠశాల మనుగడ ప్రశ్నార్థకంగా మారడం బాధాకరం. గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తు కోసం వెంటనే శాశ్వత ఉపాధ్యాయులను నియమించి పాఠశాలను పరిరక్షించాలి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి సాధ్యమవుతుంది."