స్వస్తిక్ న్యూస్, జాతీయం :- విషమ పరిస్థితుల్లో ప్రాణాలతో పోరాడుతున్న తన భర్త నుంచి వీర్యాన్ని సేకరించి భద్రపరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఒక మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. వైద్యపరంగా ఎంతో కీలకంగా మారిన ఈ పిటిషన్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. గడిచిన ఏడాది కాలంగా బాధితురాలి భర్త కోమాలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత దారుణంగా (Critical) ఉందని, కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలో, తన భర్త వారసుడిని పొందేందుకు ఆయన వీర్యాన్ని సేకరించడానికి అనుమతించాలని ఆమె కోర్టును వేడుకుంది.
భవిష్యత్తులో తన భర్త తాలూకు స్పెర్మ్ ద్వారా తల్లి కావాలనేది తన కోరిక అని ఆమె పేర్కొన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో కోమాలో ఉన్న వ్యక్తి నుండి వీర్యం సేకరించడం సాధ్యమేనా? అనే విషయాన్ని నిర్ధారించడానికి ఒక మెడికల్ ఎక్స్‌పర్ట్ కమిటీని వేయాలని పిటిషనర్ కోరారు.ఈ విలక్షణమైన కేసుపై ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ జరపనుంది. నైతిక, వైద్య మరియు న్యాయపరమైన చిక్కులతో ముడిపడి ఉన్న ఈ అంశంపై కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.