స్వస్తిక్ న్యూస్, తమిళనాడు :-తమిళ చిత్ర పరిశ్రమలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి, పల్లెటూరి కథాంశాలతో భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసిన దిగ్గజ దర్శకుడు భారతీరాజా (84) వయోభారంతో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం చెన్నైలోని భారతీరాజా నివాసానికి స్వయంగా వెళ్లిన సీఎం విజయ్.. భౌతికకాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు. భారతీరాజా నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి విజయ్, దిగ్గజ దర్శకుడి భౌతికకాయంపై పూలమాల ఉంచి నివాళులర్పించారు. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం తీవ్ర విషాదంలో ఉన్న భారతీరాజా కుటుంబ సభ్యులను సీఎం విజయ్ పరామర్శించారు. వారిని ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
భారతీరాజా మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి విజయ్ పేర్కొన్నారు. పల్లెటూరి సహజత్వాన్ని, మట్టి సువాసనలను వెండితెరపై ఆవిష్కరించి సరికొత్త ఒరవడిని సృష్టించిన మహోన్నత వ్యక్తి ఆయనని కొనియాడారు. సినిమా రంగానికి ఆయన చేసిన అమూల్యమైన సేవలకు గుర్తింపుగా, భారతీరాజా అంత్యక్రియలను అధికారిక ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.సినీ జగత్తులో విషాదం‘ఇయక్కునర్ ఇమయం’ (దర్శక శిఖరం)గా పేరొందిన భారతీరాజా మృతితో అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన క్లాసిక్ చిత్రం 'సీతాకోకచిలుక' జాతీయ అవార్డుతో పాటు నంది అవార్డును కూడా గెలుచుకుంది. ఆరు జాతీయ అవార్డులు, పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఈ మేటి దర్శకుడి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలుపుతున్నారు.