స్వస్తిక్ న్యూస్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 13 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.నిన్న రాత్రి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లడించిన ప్రధానాంశాలు ఇవే:
కీలక ఆదేశాలు:- 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో లేకుండా ఉండేలా తగిన డ్రాఫ్ట్‌ను (ముసాయిదా) సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
వయస్సు ఆధారిత కంటెంట్:- 13 నుండి 16 ఏళ్ల మధ్య వయస్సు గల వారికి వారి వయస్సుకు తగిన కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉండేలా విధివిధానాలు రూపొందించాలని స్పష్టం చేశారు.
మహిళల రక్షణ:- సోషల్ మీడియా వేదికగా మహిళలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.డిజిటల్ ప్రపంచంలో పిల్లల భద్రతను నిర్ధారించడానికి మరియు సోషల్ మీడియా వల్ల కలిగే దుష్ప్రభావాల నుండి వారిని రక్షించడానికి ప్రభుత్వం ఈ అడుగులు వేస్తోంది. దీనిపై త్వరలోనే పూర్తిస్థాయి నిబంధనలు వచ్చే అవకాశం ఉంది.