స్వస్తిక్ న్యూస్, పెద్దారవీడు :- కరువు పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఉపాధి హామీ కరువు పనుల్లో NREGA మొబైల్ యాప్ వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దారవీడు మండలం సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ తోట గురునాథం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మొబైల్ యాప్ ద్వారా హాజరు నమోదు ప్రక్రియలో నెట్‌వర్క్ సమస్యలు, సాంకేతిక లోపాలు, ఫోటో అప్‌లోడ్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కారణంగా కూలీలు పనిదినాలు కోల్పోవడంతో పాటు వేతనాల చెల్లింపులో కూడా జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఇంటర్నెట్ సౌకర్యం లేని పరిస్థితుల్లో మొబైల్ యాప్ ఆధారిత హాజరు విధానం కూలీలకు భారంగా మారిందని పేర్కొన్నారు. కరువు సమయంలో ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వం సాంకేతిక సమస్యలతో కూలీలను ఇబ్బందులకు గురి చేయకుండా, గతంలో అమలులో ఉన్న సులభమైన హాజరు విధానాన్ని పునరుద్ధరించాలని ఆయన కోరారు.