స్వస్తిక్ న్యూస్, అమరావతి :- నిత్య జీవితంలో పాలు ఒక భాగం. అయితే, మనం తీసుకుంటున్న పాలు స్వచ్ఛమైనవేనా లేక కల్తీవా అనే సందేహం చాలా మందిని వేధిస్తుంటుంది. మార్కెట్లో దొరికే పాలలో నీరు, డిటర్జెంట్లు, యూరియా వంటివి కలిపి విక్రయిస్తున్నారనే వార్తలు తరచుగా వస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో మనం తాగే పాలలో కల్తీ జరిగిందో లేదో ఇంటివద్దే చాలా సులభంగా ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
కల్తీని గుర్తించే కొన్ని సులభమైన పద్ధతులు:- డిటర్జెంట్ కల్తీ:- ఒక సీసా (బాటిల్) లో కొద్దిగా పాలు పోసి గట్టిగా కుదపండి (షేక్ చేయండి). ఒకవేళ ఆ పాలలో డిటర్జెంట్ కలిసి ఉంటే, బాగా నురగ వస్తుంది.
నీటి కల్తీ:- ఒక ప్లేట్ లేదా టైల్స్‌పై కొన్ని చుక్కల పాలు పోయండి. పాలలో ఎక్కువ నీరు కలిసి ఉంటే, అవి త్వరగా కిందికి ప్రవహిస్తాయి. స్వచ్ఛమైన పాలు అయితే నెమ్మదిగా జారుతాయి.
సింథటిక్ పాల గుర్తింపు:- సింథటిక్ పాలను అరచేతిలో పోసుకుని రెండు చేతులతో రుద్దినప్పుడు సబ్బులా జారినట్లు (ఫీలింగ్) అనిపిస్తుంది.
యూరియా కల్తీ:- ఒక పాత్రలో కొన్ని పాలు తీసుకుని అందులో సోయాబీన్ పొడిని కలపండి. అది స్వచ్ఛమైన పాలు అయితే దాని వాసనలో ఎటువంటి మార్పు ఉండదు. ఒకవేళ ఆ పాలలో యూరియా కలిసి ఉంటే, అమ్మోనియా లాంటి ఘాటైన వాసన వస్తుంది.ఈ చిన్నపాటి చిట్కాలను పాటించడం ద్వారా, మనం రోజూ తాగే పాలు ఎంతవరకు స్వచ్ఛమైనవో మనమే స్వయంగా పరీక్షించుకోవచ్చు.