స్వస్తిక్ న్యూస్,హైదరాబాద్:- మీ ఇంట్లో 18 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నారా? అయితే వారికి బండి తాళాలు ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి. మైనర్లకు వాహనాలు ఇచ్చి డ్రైవింగ్‌కు అనుమతించవద్దని రాష్ట్ర రవాణా శాఖ తల్లిదండ్రులకు గట్టిగా హెచ్చరించింది. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ 18 ఏళ్ల లోపు వయసున్న వారు డ్రైవింగ్ చేస్తూ దొరికితే, ఆ నేరానికి నేరుగా వాహన యజమాని లేదా పిల్లల సంరక్షకులనే (పేరెంట్స్) బాధ్యులుగా పరిగణిస్తామని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించి చట్ట ప్రకారం వారు కఠిన శిక్షలకు అర్హులవుతారని హెచ్చరించారు.

కేవలం కేసులు నమోదు చేయడమే కాకుండా, మైనర్లు నడిపిన వాహనాల రిజిస్ట్రేషన్‌ను ఏకంగా 12 నెలల (ఏడాది) పాటు రద్దు చేస్తామని రవాణా శాఖ స్పష్టం చేసింది.మైనర్ డ్రైవింగ్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 4,070 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ గణాంకాలను బట్టి రవాణా శాఖ ఈ విషయంపై ఎంత కఠినంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.పిల్లల ప్రాణాలతో పాటు ఇతరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.