స్వస్తిక్ న్యూస్,మార్కాపురం :- ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాదికల్లా ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దొర్నాలలో ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో సీఎం ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతి, పరిహారం పంపిణీతో పాటు స్థానిక రాజకీయాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు అంచనా వ్యయం, ఖర్చుల లెక్కలను సీఎం వివరించారు. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 10,580 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ. 6,736 కోట్లు ఖర్చయిందని తెలిపారు. ఇంకా రూ. 3,844 కోట్లు వెచ్చించాల్సి ఉందన్నారు. 2024లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 759 కోట్లు ఖర్చు చేశామని, ఇప్పుడు కొత్తగా రూ. 905 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు.తాజాగా మంజూరు చేసిన నిధుల్లోంచి ప్రాజెక్టు నిర్వాసితులకు రూ. 300 కోట్లు ఇస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. కేవలం రెండు రోజుల్లోనే ఈ డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతాయన్నారు. కలనూతల, సుకేశుల, చింతలముడిపి, గుడుంచర్ల, కాటమరాజు తండా, సాయి రాంనగర్, ముట్టిగొండి తదితర మొత్తం 1,100 గ్రామాల నిర్వాసితుల అకౌంట్లలో ఈ నిధులు వేస్తున్నట్లు వివరించారు. అలాగే, కొన్ని గ్రామాల వారికి ఇచ్చిన ప్రాంతంలోనే నూతన కలెక్టరేట్ రాబోతోందని సీఎం శుభవార్త చెప్పారు.
నిర్వాసితులతో మాట్లాడిన అనంతరం సీఎం చంద్రబాబు స్థానిక ఓటర్ల తీరుపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్కాపురం ప్రాంతానికి టీడీపీ వస్తేనే అభివృద్ధి పనులు జరుగుతాయని రైతులకు గుర్తుచేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు ఒకసారి టీడీపీకి ఓట్లు వేస్తే, మరోసారి వేయడం లేదంటూ ప్రస్తావించారు."శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి ఎక్కడా బ్రేక్ పడకుండా గెలుచుకుంటూ వచ్చాం. కానీ, మొదటి బ్రేక్ దర్శిలో పడింది. రెండవ బ్రేక్ వై.పాలెం (ఎర్రగొండపాలెం)లో పడింది. మళ్లీ ఆ బ్రేక్ రిలీజ్ అయ్యాక రాయలసీమ వెళ్లి అక్కడ 7 సీట్లు కోల్పోయాం. అసలు మీ ప్రాంతంలోనే టీడీపీకి ఎందుకు బ్రేకులు పడుతున్నాయి?" అని సీఎం స్థానికులను ఉద్దేశించి ప్రశ్నించారు.