స్వస్తిక్ న్యూస్, న్యూఢిల్లీ:- మార్కెట్‌లో పత్తి ధరలు తగ్గుతున్న వేళ రైతులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పత్తి రైతులకు నష్టం కలగకుండా ధర లోటు చెల్లింపు పథకం (Price Deficiency Payment Scheme - PDPS) అమలుకు శ్రీకారం చుడుతోంది.
వార్తలోని ముఖ్యాంశాలు:- పథకాన్ని తొలుత పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలను (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) ఎంపిక చేసింది.కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర (MSP) కంటే మార్కెట్ రేటు తక్కువగా ఉన్నప్పుడు, ఆ వ్యత్యాసాన్ని (తేడాను) ప్రభుత్వం భర్తీ చేస్తుంది. మద్దతు ధర మరియు మార్కెట్ ధర మధ్య ఉండే ఆ తేడా మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నారు.
రైతులకు భరోసా:- ఈ పథకం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, బహిరంగ మార్కెట్‌లో పత్తి ధరలు పడిపోయినప్పటికీ రైతులకు ఆర్థికంగా ఎలాంటి నష్టం వాటిల్లదు.ఈ నిర్ణయం పట్ల తెలుగు రాష్ట్రాల పత్తి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ ఒడిదుడుకుల నుండి తమను కాపాడటానికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.