స్వస్తిక్ న్యూస్, అంతర్జాతీయం :- బంగ్లాదేశ్ లో ఏ క్షణమైనా పెట్రోల్ బంకులు మూతబడే ప్రమాదం ఉంది. పొరుగు దేశం బంగ్లాదేశ్‌ను ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు అడుగంటిపోతుండటంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏ క్షణమైనా పెట్రోల్ బంకులు పూర్తిగా మూతబడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆందోళనలో బంక్ యజమానులు :- దేశంలో ఇంధన సరఫరా పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని పెట్రోల్ పంపుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చమురు సంస్థల (ఆయిల్ కంపెనీల) నుంచి డిమాండ్‌కు తగ్గట్టుగా పెట్రోల్ సరఫరా జరగడం లేదని వారు స్పష్టం చేశారు. చాలా తక్కువ స్థాయిలో మాత్రమే ఇంధనం వస్తుండటంతో వాహనదారుల అవసరాలను తీర్చలేకపోతున్నామని వారు తెలిపారు.
ఇప్పటికే బంగ్లాదేశ్ లో పలుచోట్ల బంకులు క్లోజ్:- సరిపడా నిల్వలు లేకపోవడంతో రాజధాని ఢాకాతో పాటు ఇతర ముఖ్య నగరాలు, ప్రాంతాల్లో ఇప్పటికే అనేక పెట్రోల్ బంకులు మూతబడ్డాయి. బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
ఆస్ట్రేలియాలోనూ అదే పరిస్థితి:- మరోవైపు బంగ్లాదేశ్‌లోనే కాకుండా ఆస్ట్రేలియాలోనూ ఇంధన కొరత ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాలోని కీలక రాష్ట్రాలైన విక్టోరియా, క్వీన్స్‌లాండ్, న్యూ సౌత్ వేల్స్ తదితర ప్రాంతాల్లో ఏకంగా వందలాది పెట్రోల్ బంకులు మూతబడ్డాయి. ఇంధన కొరత కారణంగా అకస్మాత్తుగా బంకులు మూతపడటంతో అక్కడి ప్రజలు కూడా ఇక్కట్లు పడుతున్నారు.