స్వస్తిక్ న్యూస్,జాతీయం :- దేశ ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేసేందుకు కుట్ర పన్నారనే సంచలన ఆరోపణలపై బీహార్ పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. ఈ ఘటన భద్రతా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. బక్సర్ జిల్లాకు చెందిన అమన్ తివారీ అనే యువకుడు అమెరికా నిఘా సంస్థ అయిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) కి ఒక ఈమెయిల్ పంపాడు. ఆ ఈమెయిల్‌లో తాను కేవలం 22 రోజుల్లోనే ప్రధాని మోదీని హతమారుస్తానని పేర్కొన్నాడు. అంతేకాకుండా, ఆ హత్య చేయడానికి తనకు భారీగా డబ్బులు చెల్లించాలని కూడా అతను అమెరికా నిఘా సంస్థను డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఈ బెదిరింపు మెయిల్ గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. బీహార్‌లోని బక్సర్ జిల్లాలో నిందితుడు అమన్ తివారీని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని డేటాను విశ్లేషిస్తున్నారు.అమన్ తివారీని అదుపులోకి తీసుకున్న తర్వాత, దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు.. ఈ కుట్రతో సంబంధం ఉందనే అనుమానంతో అతని ఇద్దరు అనుచరులను కూడా అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురిని రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. ఈ కుట్ర వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.