స్వస్తిక్ న్యూస్, ఒంగోలు :- ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) శ్రీ హర్షవర్ధన్ రాజు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఈజీ మనీ, అధిక లాభాలు అంటూ ఆశపెట్టే ప్రకటనల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా మోసాలు ఎక్కువయ్యాయని ఎస్పీ పేర్కొన్నారు. "ఇంటి నుంచే సులభంగా సంపాదన," "తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు," "పార్ట్ టైమ్ జాబ్స్" వంటి ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి అమాయక ప్రజలు మోసపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో ప్రజలను ఆకర్షించి, వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారని హెచ్చరించారు. పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేసే యాప్‌లు, వెబ్‌సైట్లు మరియు సోషల్ మీడియా లింకుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. తెలియని వ్యక్తులు పంపే లింక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని, అలా చేస్తే ఫోన్ లేదా కంప్యూటర్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏదైనా సంస్థలో పెట్టుబడి పెట్టే ముందు దాని పూర్వాపరాలు, విశ్వసనీయతను క్షుణ్ణంగా నిర్ధారించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
అప్రమత్తతే శ్రీరామ రక్ష:-
సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు కోరారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ (OTP), పిన్ (PIN) నంబర్లను ఎవరితోనూ పంచుకోవద్దని ఆయన సూచించారు. ఏదైనా అనుమానాస్పద ఆఫర్లు ఎదురైతే వెంటనే స్థానిక పోలీసులకు లేదా టోల్ ఫ్రీ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు ఫిర్యాదు చేయాలని కోరారు. సత్వరమే ఫిర్యాదు చేయడం ద్వారా పోయిన డబ్బును రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన వివరించారు.ప్రజలు అత్యాశకు పోకుండా, వాస్తవాలను గ్రహించి అప్రమత్తంగా ఉంటేనే సైబర్ మోసాలను అరికట్టగలమని ఎస్పీ స్పష్టం చేశారు.