స్వస్తిక్ న్యూస్ ,హైదరాబాద్ :- తెలుగు సంస్కృతిలో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు ఉండనుంది. ఈ నెల రోజులు కొత్తగా పెళ్లయిన నూతన వధూవరులను ఒకరికొకరు దూరంగా ఉంచడం, వధువును పుట్టింటికి పంపించడం హిందూ సంప్రదాయంలో తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే ఈ సాంప్రదాయం వెనుక కేవలం నమ్మకాలు మాత్రమే కాదు.. బలమైన శాస్త్రీయ, సామాజిక కారణాలు కూడా దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఆ విశేషాలు ఇవే...
- వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా..పూర్వ కాలంలో వర్షాకాలం ప్రారంభంలో (తొలి వానలు పడగానే) వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగేవి. కొత్తగా పెళ్లయిన జంటలు తమ జీవిత భాగస్వామితోనే ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. దీనివల్ల కీలకమైన సాగు పనులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో, నూతన వధువును ఆమె పుట్టింటికి పంపించే ఆచారం పెట్టారు. దీనివల్ల వ్యవసాయ పనులు సజావుగా సాగేవి.
- తల్లి, బిడ్డ క్షేమం కోసమే.. (శాస్త్రీయ కోణం)ఆషాఢ మాసంలో భార్యాభర్తలు దూరంగా ఉండటానికి అత్యంత ముఖ్యమైన ఆరోగ్య కారణం మరొకటి ఉంది. ఒకవేళ ఆషాఢంలో భార్య గర్భం దాల్చితే, సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత అంటే ఎండలు మండిపోయే మార్చి, ఏప్రిల్ లేదా మే (వేసవి కాలం) నెలల్లో ప్రసవం జరుగుతుంది.పూర్వకాలంలో ప్రస్తుత రోజుల్లో ఉన్నట్లు ఏసీలు, కూలర్లు వంటి ఆధునిక సదుపాయాలు ఉండేవి కావు. తీవ్రమైన ఎండల వేడిని కొత్తగా జన్మించిన పసికందు, బాలింత తట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఎండల తీవ్రత వల్ల తల్లి, బిడ్డల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లకుండా రక్షించేందుకే పెద్దలు ఈ నియమాన్ని పెట్టారు.మన పెద్దలు పెట్టిన ప్రతి ఆచారం వెనుక సమాజ శ్రేయస్సు, ఆరోగ్యం దాగి ఉన్నాయనడానికి ఆషాఢ మాస నియమాలే ఒక నిదర్శనం.